తెలంగాణాలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కలాన్ని, గళాన్ని అందించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు అని హెచ్ సి యు మానవీయ శాస్త్రాల విభాగం డీన్ ఆచార్య వి. కృష్ణ అన్నారు. గురువారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖలో దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆచార్య వి. కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి నుండి పోరాట స్ఫూర్తితో సాహిత్యాన్ని వెలువరించిన గొప్ప కవి దాశరథి అనీ, ఆ పోరాట స్ఫూర్తిని నేటికీ ఉద్యమకారులు అందుకోవలసిన అవసరం కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సాహిత్య వారసత్వాన్ని నిలిపిన దాశరథి గురించి పలువురు వక్తలు మాట్లాడారు. హెచ్ సి యు అధ్యాపక సంఘం అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ దాశరథి బహుముఖ ప్రజ్ఞావంతుడనీ, ఒకవైపు పోరాట గీతాలు రచించినా, తదనంతర కాలంలో ఉత్తమమైన సినిమా పాటలు, విలువైన విమర్శనా వ్యాసాలను వెలువరించారనీ, గాలిబ్ గీతాల ద్వారా ఉర్దూసాహిత్య మాధుర్యాన్ని అందించారని అన్నారు. ఆచార్య జి.అరుణకుమారి, ఆచార్య పమ్మి పవన్ కుమార్, డా.డి.విజయకుమారి తదితరులు మాట్లాడుతూ దాశరథి గారి సాహిత్య వైశిష్ట్యాన్ని, ఆయన ఉద్యమ స్ఫూర్తిని వివరించారు.