Phone: 9182685231
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పరిచయం
శ్రీమతి పెదనాగమ్మ, లంకయ్య (అబ్బాయి) దంపతులకు తూర్పుగోదావరి జిల్లా, చెయ్యేరు అగ్రహారంలో 5 సెప్టెంబరు 1973లో జన్మించిన వెంకటేశ్వరరావు, కోనసీమలోనే ప్రాథమిక విద్యను అభ్యసించారు. కోనసీమ ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన శ్రీబానోజీరామర్స్ కళాశాల, అమలాపురం (1995)లో ఇంటర్మీడియట్ నుండి బి.ఏ., (స్పెషల్ తెలుగు) వరకు చదువుకున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు (సెంట్రల్ యూనివర్సిటి)లో ఎం.ఏ., తెలుగు (1997);ఎం.ఫిల్.,( 1998); పి హెచ్.డి., (2003) చేశారు. ఆచార్య ఎస్.శరత్ జ్యోత్స్నారాణి గారి పర్యవేక్షణలో జ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన పేరు చేసిన పరిశోధనకు ఎం.ఫిల్.; ''పరిశోధకుడుగా ఆరుద్ర ' పేరుతో చేసిన పరిశోధనకు పిహెచ్.డి., పట్టాలను అందుకున్నారు. నిజాం కళాశాల (ఉస్మానియా విశ్వవిద్యాలయం)లో సంస్కృతంలో డిప్లొమా (1997), తెలుగు లింగ్విస్టిక్స్ అండ్ లాంగ్వేజ్ టీచింగ్ లో పి.జి.డిప్లొమాని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (2000) లో చేశారు. వీటితో పాటు డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (2005) లో ఎం.ఏ., (సోషియాలజీ) చేశారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలో బి.ఏ., స్పెషల్ తెలుగు ఫస్ట్ ర్యాంకు సాధించిన వారికిచ్చే కళాప్రపూర్ణ జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతిని, కందుకూరి వీరేశలింగం, శ్రీమతి రాజ్యలక్ష్మి స్మారక బహుమతుల్ని అందుకున్నారు. వీటితో పాటు శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కళాశాల వారు కాలేజీ ఫస్ట్ వారికిచ్చే నండూరి వెంకటరామయ్య, కుటుంబలక్ష్మి స్మారక బహుమతుల్ని సాధించారు.
విద్యార్ధిగా మెరిట్ స్కాలర్ షిప్ఫుతో పాటు, యు.జి.సి., రీసెర్చ్ ఫెలోషిప్‌ని సాధించారు. పరిశోధన చేస్తుండగానే ప్రభుత్వ, డిగ్రీ కళాశాలల్లో పోటీ పరీక్ష ద్వారా ఏకకాలంలో (2001) అధ్యాపకుడుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత 2004లో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంటు ప్రొఫెసరుగా చేరారు. ప్రస్తుతం అదే శాఖలో 2016 నుండి ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు.
విద్యార్ధి దశ నుండే వివిధ పత్రికల్లో కవితలు, వ్యాసాలు రాసే అలవాటున్న వెంకటేశ్వరరావు, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో చేరిన తర్వాత ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం, యువవాణి విభాగంలో కొంతకాలం పాటు క్యాజువల్ (క్యాంపియర్) ఎనౌన్సర్‌గా పనిచేశారు. ఆ నాటి నుండి నేటి వరకు ఆకాశవాణిలో అనేక కవితలు, సాహితీ ప్రసంగాలు చేస్తున్నారు. పరిశోధన విద్యార్థిగా ఉన్నప్పుడే సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు తెలుగు సాహిత్యంలో శిక్షణనిస్తూ, దూరదర్శన్‌లో కూడా ప్రసంగాలిచ్చారు.
వివిధ విశ్వవిద్యాలయాల్లో జరిగిన జాతీయ సదస్సుల్లో సుమారు 126 పరిశోధన పత్రాలను సమర్పించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ‘‘వాఙ్మయి’’, తెలుగు అకాడమీ వారి ‘‘తెలుగు వైఙ్ఞానిక మాసపత్రిక’’, ద్రావిడ విశ్వవిద్యాలయం వారి ‘‘ద్రావిడి’’ వంటి పరిశోధన పత్రికలు, ప్రత్యేక సంచికలు, దినపత్రికల్లో సుమారు 96 పరిశోధన, విమర్శ పత్రాలు ప్రచురితమైయ్యాయి.
ఇవ్పటివరకు కవిత్వం, విమర్శ, పరిశోధనలకు సంబంధించి పద్దెనిమిది (18) పుస్తకాలను ప్రచురించారు. మాదిగచైతన్యం (1997) సంపాదకత్వం, సాహితీ మూర్తుల ప్రశస్తి (1998) సహ సంపాదకత్వం, జ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన (1999) పరిశోధన, దళితతాత్త్వికుడు (2004) కవిత్వం, సృజనాత్మక రచనలు చేయడం ఎలా? ( 2005) విమర్శ, సాహితీసులోచనం (2006) విమర్శ, ఒక మాదిగస్మృతి -నాగప్పగారి సుందర్రాజు (2007) మోనోగ్రాఫ్, విమర్శ, వీచిక (2009) విమర్శ, పునర్మూల్యాంకనం (2010) బహుజన సాహిత్య దృక్పథం(2012)‘సాహితీమూర్తులు-స్ఫూర్తులు(2015), నెమలికన్నులు2016 (కవిత్వం), సాహితీ సౌగంధి (2016), ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు రాసిన ‘సాహిత్య పరిశోధన-కళ:విధానం (2017) గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించారు. విద్యార్థులకు పాఠ్యాంశంలో భాగంగా కందుకూరి వీరేశలింగంగారి శ్రీరాజశేఖరచరిత్రము నవలపై ప్రత్యేకించి ఒక రోజంతా విద్యార్థి సదస్సు నిర్వహించారు. ఆ పత్రాలను తాను ప్రధాన సంపాదకుడిగా ఉండి ‘‘రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు’’ పేరుతో 2017లో ప్రచురించారు. మరో రెండు గ్రంథాలు ప్రచురణలో ఉన్నాయి. ఈయన కవిత్వం ఆంగ్లంలో డా.జె.భీమయ్యగారు అనువదించగా ప్రెస్టేజ్ పుస్తక ప్రచురణల సంస్థ, న్యూఢిల్లీవారు Voice of Dalit: The Poetry of Darla Venkateswara Rao పేరుతో 2018లో ప్రచురించారు. ఆక్స్ ఫర్డ్ ప్రెస్ వారి The Oxford India Anthology of Telugu Dalit Writing లో ఈయన కవితను తీసుకున్నారు. ఈయన కవిత్వంపై ప్రెసిడెన్సి కళాశాల ( యూనివర్సిటి ఆఫ్ మద్రాస్) లో పరిశోధన చేశారు.
ఆచార్య వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఇప్పటి వరకు పందొమ్మిది (19) ఎం.ఫిల్.,పరిశోధనలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈయన పర్యవేక్షణలో పన్నెండుమంది (12) పిహెచ్.డి., పట్టాలు పొందారు. మరో ఎనిమిది మంది పిహెచ్.డి.,పరిశోధనలు చేస్తున్నారు.
చిన్ననాటి నుండే సాహిత్యాభిలాష గల వెంకటేశ్వరరావు వ్యాసరచన సోటీలో భారతీయ సాహిత్య పరిషత్ రాజమండ్రిలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి (1996) ని అందుకున్నారు. సాహిత్యానికి ఈయన చేస్తున్న కృషికి గుర్తింపుగా భారతీయ దళిత సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ వారు 2007లో డా.బి.ఆర్. అంబేద్కర్ పురస్కారంతో సత్కరించారు. 2012 వ సంవత్సరానికి గాను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఈయనకు ఉత్తమ విమర్శ విభాగంలో కీర్తి పురస్కారాన్ని అందించారు. బహుజన రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ వారిచ్చే మధురకవి మల్లవరపు జాన్ కవి స్మారక పరిశోధన పురస్కారాన్ని 2016లో పొందారు. ఉత్తమ బోధన, పరిశోధన రంగాల్లో కృషి చేసినందుకుగాను హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వారు 2016 విద్యాసంవత్సరానికి గాను 2016 అక్టోబరు 1 న జరిగిన 18వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డుకి గాను లక్షరూపాయల ప్రత్యేక పరిశోధన గ్రాంటుని మంజూరు చేశారు. యునైటెడ్ ఫ్రంట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్, సాహితీవిభాగం, వరంగల్లు వారు జాషువా జాతీయ పురస్కారం (2016) తో 2016 నవంబరు 6 వతేదీన డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఆచార్య ఆర్.సీతారామారావుగారి చేతుల మీదుగా సత్కరించారు. డా.ఆనంద్ గారి చేతుల మీదుగా శ్రీమతి జెన్నె మాణిక్యమ్మ విశిష్ట సాహిత్య పురస్కారం (2017) అందుకున్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, హైదరాబాదు స్వచ్చందసంస్థ వారు మదర్ తెరీసా పురస్కారంతో 26 ఆగస్టు 2018 వ తేదీన సంస్థ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించి, పురస్కారాన్ని ప్రదానం చేశారు.
అంతర్జాల మాసపత్రిక‘విహంగ’ 2017 వ సంవత్సరం నుండి విహంగ సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. 2017వ సంవత్సరానికి గాను విహంగ అంతర్జాల పత్రిక పురస్కారాన్ని డా.దార్ల వెంకటేశ్వరరావు అందుకున్నారు. ఈ పురస్కారాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠం, బొమ్మూరు (రాజమహేంద్రవరం)లో 2017 జనవరి 11 వతేదీన జరిగిన పురస్కార ప్రదానోత్సవ సభలో యూనివర్సిటి వైస్-ఛాన్సలర్ ఆచార్య ఎస్వీసత్యనారాయణ, సాహిత్య పీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు, విహంగ మాసపత్రిక సంపాదకురాలు డా. పుట్ల హేమలతల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని దళిత ఓపెన్ యూనివర్సిటి ఆఫ్ ఇండియా, గుంటూరు వారు డా.బి.ఆర్.అంబేద్క జాతీయ పురస్కారాన్ని 13 జూలై 2019 వ తేదీన గుంటూరులో నిర్వహించిన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, ఐదువేలరూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. 19 అక్టోబరు 2019 వ తేదీన రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో బి.సి.కమీషన్ చైర్మన్ బి.ఎస్.రాములు, ఉత్సవసంఘం నిర్వాహకులు, నేషనల్ బుక్ ట్రస్ట్ సంపాదకులు డా.పత్తిపాక మోహన్ చేతుల మీదుగా బహుజన తత్త్వవేత్త బి.యస్.రాములు ప్రతిభా పురస్కారాన్ని విశాల సాహిత్య అకాడమీవారు ప్రదానం చేశారు.
పత్రికలు-సంపాదకత్వం:
బహుజన కెరటాలు మాసపత్రిక, విద్య మాసపత్రికలకు సంపాదక వర్గ సభ్యులుగా, మాదిగసమాచారలేఖ మాసపత్రిక గౌరవ సంపాదకులుగా, ప్రజామణిపూస మాసపత్రిక గౌరవ సలహామండలి సభ్యునిగా, రాయలసీమ జాగృతి గౌరవ సంపాదకుడు, భావవీణ మాసపత్రిక గౌరవ సలహాదారు, జౌచిత్యమ్ అంతర్జాల పత్రిక సంపాదకవర్గ సభ్యులుగా, సొసైటీ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టు సలహాదారుగా ఉన్నారు. జ్యోత్స్నాకళాపీఠం, తెలుగు సాహిత్య వేదిక, మాదిగ సాహిత్య వేదిక వంటి సాహిత్య సాంస్కృతిక సంస్థల్లో కార్యవర్గసభ్యుడుగా పనిచేశారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబరు
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివిధ విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ (పాఠ్య ప్రణాళిక సంఘ సభ్యులు) గా ఉన్నారు.మద్రాసు విశ్వవిద్యాలయం, చెన్నై (2020 -2023), కృష్ణ విశ్వవిద్యాలయం, మచిలీపట్నం (2020 -2022), బెంగళూరు విశ్వవిద్యాలయం, బెంగళూరు, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (వారణాసి), పాండిచ్చేరి విశ్వవిద్యాలయం (డా.ఎస్.ఆర్.కె. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, యానాం), పి.బి.సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, (విజయవాడ), ఆంధ్ర లయోలా కళాశాల, (విజయవాడ), తారా ప్రభుత్వ కళాశాల, (సంగారెడ్డి). వీటితో పాటు తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం, దళిత మరియు ఆదివాసి పరిశోధన కేంద్రంలలో సభ్యునిగా ఉన్నారు. సిలబస్ రూపకల్పన చేయడం సభ్యుల విధి. దీనిలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు భాగస్వాములుగా ఉన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో ఎం.ఏ., తెలుగు విద్యార్థులకు ‘‘దళితసాహిత్యం’’, ప్రవాసాంధ్ర సాహిత్యం –పరిచయం’’ ‘పరిశోథన గ్రంథ రచనా నైపుణ్యాలు‘(Techniques of Writing a Thesis/Dissertation) అనే కోర్సులను పాఠ్య ప్రణాళికలుగా రూపొందించారు. వీటితో పాటు తెలుగు సాహిత్య విమర్శ, సౌందర్యశాస్త్రం, తులనాత్మక కళాతత్త్వశాస్త్రం కోర్సులను బోధిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు వారు దూరవిద్య ద్వారా బోధించే జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ కోర్సు పి.జి. డిప్లొమా విద్యార్థులకు రెండు పాఠాలను రాశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో ఐదు సంవత్సరాల ఎం.ఏ. కోర్సు (ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ) తెలుగు విభాగం కోర్డినేటర్‌గా సేవలందించారు. భారతీయ సాహిత్య అకాడమి, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మొదలైన వారిచ్చే పురస్కార కమిటీల్లోను, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, సిద్ధార్థ (స్వయంప్రతిపత్తి) కళాశాల, విజయవాడ, తెలుగుశాఖలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబరుగాను పనిచేశారు.
ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, తెలుగు శాఖలో ప్రొఫెసరుగా పనిచేస్తూ, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘‘తెలుగు సాహిత్యంలో మాదిగల సామాజిక, సాంస్కృతిక అధ్యయనం’’ అనే అంశంపై యు.జి.సి వారి మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టు పూర్తి చేశారు. ఈయన రచనలను ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ (https://archive.org, http://vrdarla.blogspot.com/) లో అందుబాటులో ఉంచడంతో పాటు, దానిపై చర్చలు చేస్తుంటారు. విద్యార్ధులకు బోధించే కోర్సు వివరాలు, మెటీరియల్ కూడా ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకొనే వీలుకల్పిస్తుంటారు.